- సమస్యలపై సంఘటితంగా ఉద్యమిద్దాం: జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమసమాజ స్థాపన, వర్గరహిత సమాజ నిర్మాణం, కార్మిక వర్గ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా సీపీఐ వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. అనేక రాజకీయ పార్టీలు కాలక్రమంలో కనుమరుగైనా, నేటికీ ప్రజల మధ్య సజీవంగా నిలిచిన పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. సమస్య ఉన్న చోట కమ్యూనిస్టులు ఉంటారన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ప్రజల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పులు రాలేదన్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, నిరుద్యోగం, అవినీతి, అక్రమాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ అందడం లేదని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ప్రజలపై పన్నుల భారం పెంచుతోందని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన మార్పులు కనిపించడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు నలువాల సదానందం, గుంటూరుపల్లి శాఖ కార్యదర్శి సాయవేణి రాయమల్లు, సీనియర్ నాయకులు సామల్ల కొమురయ్య, చిందం మల్లయ్య, తంగెళ్ల లక్ష్మయ్య, పిల్లి రమేష్, తాత సమ్మయ్య, తంగెళ్ల సంపత్, సదయ్య, గొడుగు సంపత్, సాయవేణి రాజు తదితరులు పాల్గొన్నారు.