- విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: కాంగ్రెస్ నాయకులు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 27: జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన “చాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు, యువత, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల కారణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతను నిరాశకు గురి చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితులకు నిరసనగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు “చాత్రోన్ కీ గూంజ్” ఉద్యమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.ఈ ఉద్యమంలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ చర్చాంశంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల కలలపై ఆధారపడి ఉందని, విద్యారంగంలో సమగ్ర సంస్కరణల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దయాల శరత్, ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు చెట్టే భార్గవ్, కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు ద్యావనపల్లి రాజేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.