- నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రణవ్ కృషి ఫలించింది
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ:కాంగ్రెస్ నాయకులు

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం వొడితల ప్రణవ్ రాష్ట్ర మంత్రులతో పలుమార్లు చర్చించి, ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో నిధుల మంజూరు సాధ్యమైందని తెలిపారు. ఇందుకు మండల ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందని విమర్శించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినప్పటికీ నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఇల్లందకుంట మీదుగా పలుమార్లు ప్రయాణించిన అప్పటి ప్రజాప్రతినిధులు కూడా నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణంపై దృష్టి సారించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన తర్వాత, దానిని తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణం, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని, హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ నిరంతరం మంత్రులతో సమన్వయం చేస్తూ నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.