
హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:
బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నప్పటికీ లోలోపల ఒప్పంద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.పీఎంజే జ్యూవెలరీ షాపులో జరిగిన ఘటనపై ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా స్పందిస్తున్నారని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పారు. ఇలాంటి సమయంలో పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అన్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యల కంటే సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వావిలాల సమీపంలో అగ్నిప్రమాదంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సమయం లేకపోయినా,రాజకీయ విమర్శలకు మాత్రం ముందుంటున్నారని అన్నారు.

“కరీంనగర్ జిల్లా ప్రశాంతంగానే ఉంది”
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వంటి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రణవ్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యం కోసం అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని, హుజురాబాద్‌లో ప్రజల మధ్య విశ్వాసం కోల్పోయి కరీంనగర్లో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
“కేటీఆర్‌లో అధికార దాహం కనిపిస్తోంది”
వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రైతు సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన విమర్శలు ఆయనలోని అసహనం, అధికార దాహాన్ని బయటపెడుతున్నాయని ప్రణవ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే భారీ స్థాయిలో రుణమాఫీ అమలు చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, సన్నవడ్లకు ప్రోత్సాహకం, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకుంటోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.