- ఏఐఐఈఏ హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్:
కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న 2024 బీమా చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరు తిరస్కరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి కోరారు. బీమా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా వచ్చే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కుమార్ స్వామి మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరోగమన బీమా సవరణ బిల్లు 2024 ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాలసీదారులకు, సాధారణ పౌరులకు, ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ అనాలోచిత బీమా చట్ట సవరణలను పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) నేతృత్వంలో బీమా ఉద్యోగులు బీమా చట్ట సవరణల బిల్లు 2024 కు వ్యతిరేకంగా తీవ్ర పోరాటానికి, సమ్మెతో ‘సహా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నామన్నారు. భారతీయ బీమా పరిశ్రమకు ఏమాత్రము అవసరం లేని ఈ సవరణలు అటు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గాని, పాలసీదారులకు గాని ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చక పోగా, బీమా పరిశ్రమకు తప్పకుండా ప్రతికూలంగా మారుతాయన్నారు. బీమా జాతీయకరణ జరిగిన 1956 కంటే ముందు దేశీయ బీమా రంగంలో నెలకొని ఉన్న ఆర్థిక మోసాలకు, పాలసీదారుల వంచన వంటి పరిస్థితులకు, ఈ సవరణలు తప్పక దారి తీస్తాయన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును ప్రతిఒక్కరు తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఈఏ బ్రాంచ్ కార్యదర్శి ఆకుల చందర్, పి శ్రీనివాస్,రిచిత్ రెడ్డి,అంజలి,ఆర్. కుమారస్వామి,ఏం.ప్రేమకుమార్,ఎల్ఐసి ఉద్యోగులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
