భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

By dhanadhannews.com

  • ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనగిరి మహేందర్,బ్రాహ్మణపల్లి యుగంధర్

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారని తన 13వ ఏటనే దేశ స్వాతంత్య్రోద్యమానికి ప్రభావితుడయ్యారని బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు,బ్రిటీష్‌వారు దిగుమతి చేసిన దుస్తులను తగలబెట్టి స్వాతంత్య్రోద్యమంలోనే విప్లవోద్యమానికి తెరలేపారన్నారు.1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లాలా లజపతిరాయిని హతమార్చిన ఘటన భగత్‌సింగ్‌ను ఎంతో కలచివేసిందని 1929లో బ్రిటీష్‌ అసెంబ్లీలో పొగబాంబు విసిరి భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేశ్‌లు బ్రిటీష్‌ పాలకులనే గడగడలాడించారన్నారు.ఈ పోరాటంలో విప్లవం వర్థిల్లాలి, శ్రామికవర్గం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్థిల్లాలనే ఉత్తేజింపజేసే నినాదాలను కూడా రూపొందించారని తనకు ఉరి ఖాయమని తెలిసినా ఎక్కడా అధైర్యపడకుండా నిత్యం జైల్లో నిరంతరం  అధ్యయనం చేశారన్నారు.లాహోర్ జైలులో 114రోజులు దీక్షచేసి ఖైదీల డిమాండ్లను పరిష్కరించి రాజకీయ ఖైదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచానికి సోషలిజమే మార్గమనే సిద్ధాంతాన్ని చెప్పిన మహోన్నత వ్యక్తులైన మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌ సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నారు. ఆ ముద్రే తన తుదకంటూ ఉండాలనే కృతనిశ్చయంతో ”మార్క్సిస్టు”గా ప్రకటించుకున్నారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా నిలిచిన భగత్‌సింగ్‌ ”నేను ఎందుకు నాస్తికుడినయ్యాను!” అనే దానిపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. 23 ఏళ్ల వయస్సుకే 1931 మార్చి 23న దేశం కోసం ఉరికొయ్యలను ముద్దాడుతూ చెరసాలలు లెక్కచేయకుండా దేశం కోసం ఉరికంబమెక్కి ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయి దేశానికే ఆదర్శప్రాయుడయ్యాడని ఆయన మరణం ఎంతోమంది హృదయాలను తట్టి లేపింది అన్నారు.అనంతరం ఎందరో యువకిశోరాలు స్వాతంత్య్ర పోరాటంలోకి  ఉద్యమించారని,
భగత్‌సింగ్‌ వంటి మహోన్నత ఆదర్శప్రాయుని స్ఫూర్తిని నేటి యువత స్మరించుకుంటేనే చాలదని,ఆ స్ఫూర్తితో అవినీతి, మతోన్మాదం, అశ్రితపక్షపాతంతో నిండిపోయిన మన పాలకుల ఉచ్చులో నుంచి యువతను బయట పడేయకుంటే దేశం మరో 100 ఏళ్లు వెనక్కుపోతుందేమోనన్న ఆందోళన కలిగిస్తుంది. స్వాతంత్య్ర సాధనకు 200 ఏళ్లు పడితే, దాని ఫలాలు అందరికీ అందడానికి ఎన్నేళ్లు పట్టాలని నేటి పాలకులను నిలదీసే స్థాయికి నేటి యువత ఎదగాలన్నారు. దేశ సంపదను కొల్లగొట్టే చర్యలపై ఒక కన్నేసి ఉంచాలి.అందరికీ విద్య, ఉద్యోగ ఉపాధి అంటూనే ఎన్డీఏ ప్రభుత్వం కార్పోరేట్లకు రాయితీలు ఇస్తుందన్నారు.దేశ సంపదను ప్రజలందరికీ చెందేలా ఉవ్వెత్తున సమరశీల పోరాటాలు చేయటమే భగత్‌సింగ్‌ లాంటి విప్లవ కిశోరాలకు మనమిచ్చే ఘనమైన నివాళి  అన్నారు.ఈ కార్యక్రమంలోఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచుల మురళి, సదశివ, భాస్కర్, రాజు, మోహన్, జీవన్, సతీష్, శ్రీనివాస్, సింగ్,  తదితరులు పాల్గొన్నారు