వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • THR TEAM అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని THR టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు, కూలీలు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రులు వంటి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెంటనే తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


“వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది” అని హరీష్ వర్మ అప్పని అన్నారు.అలాగే ప్రజలు కూడా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలని, సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించుకోవడం మంచిదని చెప్పారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.


ఇంకా మాట్లాడుతూ, “ఎండల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలు తరచూ తాగునీరు తీసుకోవాలి. ప్రభుత్వం, అధికారులు కూడా వేసవి కాలం ముగిసే వరకు తాగునీటి సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి” అని హరీష్ వర్మ అప్పని పేర్కొన్నారు.

Leave a comment