- పొన్నం ప్రభాకర్ వి మతి భ్రమించిన మాటలు
- బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు
వీణవంక(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 22:వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బిజెపి జిల్లా,మండల నాయకులు పర్యటించి రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం చేయవలసిన పనుల గురించి గ్రామ నాయకులకు,కార్యకర్తలకు పలు సూచనలు చేయడం జరిగింది.అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ పార్లమెంటు కు బండి సంజయ్ ఏమీ అభివృద్ధి చేయలేదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలు పంచుకుందని,గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే రెండంతల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గుర్తు చేశారు.కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి కంటే బండి సంజయ్ రెట్టింపు అభివృద్ధి చేశాడని దీనిపైన మేము చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అని సంపత్ రావు సవాల్ విసిరారు.ఎంపీ గా బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ పరిధిలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాడని ఈ విషయం పొన్నం ప్రభాకర్ కు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.పార్లమెంట్ పరిధిలోని వేములవాడ, కొండగట్టు,ఇల్లందకుంట దేవస్థానాల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత పొన్నం ప్రభాకర్ కు లేదన్నారు.అతను ఎంపీగా ఉన్న సమయంలో దేవాలయాలకు ఏం చేశారో చెప్పాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి కోసం బండి సంజయ్ అనేక సందర్భాలలో అంచనాలు వేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను(దేవదాయ శాఖ)కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని అన్నారు.చాలా సందర్భాలలో పత్రికా ముఖంగా బండి సంజయ్ ఈ విషయాన్ని తెలియజేసారని, అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని సంపత్ రావు డిమాండ్ చేశారు. ఆలయాలు అభివృద్ధి చేస్తే బండి సంజయ్ కి పేరు వస్తుందని కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని,అదే ఆలోచనతో ఆనాడు పోన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడని ఆరోపించారు.పార్లమెంటు అభివృద్ధి కోసం పని చేస్తూనే,రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ప్రజల పక్షాన పోరాడి ఎన్నో కేసులు ఎదుర్కొని జైలుకు పోయినా వ్యక్తి బండి సంజయ్ ని,గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పొన్నం ప్రభాకర్ ప్రజల కోసం ఎక్కడ పోరాటాలు చేశాడో చెప్పాలనని డిమాండ్ చేశారు.పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా బండి సంజయ్ మీద అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని సంపత్ రావు చురకంటించారు.పొన్నం ప్రభాకర్ ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసిన విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.నియోజక వర్గ ప్రజలకు అండగా ఉండి,పార్లమెంట్ అభివృద్ధి కోసం పరితపించే బండి సంజయ్ కి అండగా కరీంనగర్ ప్రజలు నిలబడి,రెండు లక్షల ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ ని గెలిపిస్తారని సంపత్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని,కాంగ్రస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లో వచ్చిన ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఎన్నికల తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి ఊడడం ఖాయమని సంపత్ రావు జోస్యం చెప్పారు. పొన్నం ప్రభాకర్ కు బండి సంజయ్ భయం పట్టుకుందని,అందుకే సంజయ్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని సంపత్ రావు దుయ్యబట్టాడు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు తో పాటు , రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుప్పల రఘు,జిల్లా కార్యదర్శి, నర్సింహ రాజు,నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి,మండల నాయకులు,బూత్ అధ్యక్షులు,తదితరులు పాల్గొన్నారు.
