వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసే కుట్ర

By dhanadhannews.com

  • బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ము నరేష్,హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.గత 20 రోజులుగా విద్యార్థులు,విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకునీరెత్తనట్లుగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఈ రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని,పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష నేతలకు నీట్ అవకతవకలపై మాట్లాడే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీట్ అవకతవకలపై మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు మెదపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేసి నిరుద్యోగులను విద్యార్థులను ఉసిగొలిపి అధికారం చేజిక్కిన తర్వాత విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యోగులను విస్మరించిన రేవంత్ రెడ్డికి త్వరలోనే తగు బుద్ధి చెప్తారని ఇప్పటికైనా నీట్ విద్యార్థుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రంలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధంగా సుప్రీంకోర్టును ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల రాబోయే రోజులలో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా చేలామణి అవుతున్న బండి సంజయ్,కిషన్ రెడ్డి ఎందుకు నేటికి విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా పోరాటం చేయడం లేదని అధికార దాహం కోసం పరితపించే మంత్రులను భవిష్యత్తులో రోడ్లమీద తిరగనియ్యమని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్, చింతల కౌశిక్,పర్లపెల్లి శ్రీనివాస్,పాతకాల అజయ్, పాకాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.