- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్,జూన్ 30(ధనాధన్ న్యూస్): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. యూరియా పంపిణీలో యాప్ విధానం రైతులకు మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం మరింత స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, ప్రాజెక్టులను నింపి ఉంటే కరువు పరిస్థితులు తలెత్తేవి కావని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా , మూడు విడతల రైతుబంధు అందించలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరోసారి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.